సిద్దిపేట, వెలుగు: సన్ ఫ్లవర్ ను కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని పేర్కొంటూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల వద్ద రైతులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అల్లీపూర్ సొసైటీ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 45 రోజులుగా సన్ ఫ్లవర్ కొనుగోలు చేయడం లేదన్నారు.
అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. మండుటెండలో కుప్పల వద్ద పడిగాపులు పడుతున్నామని తెలిపారు. చాలా రోజులుగా ఒకే చోట కుప్పగా పోయడంతో కింది వైపు చెదలు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నకోడూరు, మెట్ పల్లి, చౌడారం, సలంద్రి, విఠలాపూర్ గ్రామాల రైతులు రాస్తారోకో చేపట్టారు. రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో చిన్నకోడూరు ఎస్సై వివేక్ అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
రామాయంపేటలో వడ్లు కొనాలని..
రామాయంపేట: వడ్ల కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆదివారం సిద్దిపేట రహదారిపై రాస్తారోకో చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట ఎస్సీ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకోతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
